దేవుడితో ముచ్చట్లు
ఇంతకు మునుపు మీకు చాలా సార్లు చెప్పానుగా నాకు మహాదేవుడి దగ్గర,శ్రీ మహా విష్ణువు దగ్గర కాస్త అలవాటు, చనువూ ఉంది అని.అప్పుడప్పుడు మా కబుర్లు, మీకు నా ద్వారా ఆయన చెప్పమన్న కబుర్లు కూడా గత ఐదారేళ్లుగా అందిస్తూనేవున్నా-మీలో కొందరికన్నా గుర్తుండే ఉండాలి!
ఆయనతో నాకున్న చనువుతో నిన్న పడుకునేముందు శ్రీమహావిష్ణువుని మన బాలు గురించి అడిగాను! దానికి ఆయన “నేనూ శ్రీలక్ష్మి ఈ మధ్య బాలు పాటలు వింటున్నప్పుడు ఓపాట విని ఇద్దరం చలించి,కదిలిపోయాం” అన్నాడు!
“అదేమీ పాట స్వామీ” అని అడిగాను! “అంతర్యామీ-అలసితి, అలసితి” అని చాలా వేదనగా పాడాడయ్యా- ఇక మేము ఆగ లేకపోయాం, మాఇద్దరి కళ్ళవెంటా అశ్రుధారలే- ఇక ఆగలేక మహాదేవుడికి కబురు చేశా, తక్షణమే బాలుని తీసుకొచ్చేయమని.ఆ విషయం బ్రహ్మ చెవిలో వేసాడనుకుంటా; ఆయన అదిరిపడి నా దగ్గరకు వచ్చేసాడు.
వస్తూనే “అదేమిటి ప్రభూ, బాలుకి ప్రత్యేకంగా “నిండు నూరేళ్ళ ఆయుర్దాయం” ఇచ్చి పంపింది మీరే కదా, ఇలా ఇప్పుడు అర్ధాంతరంగా, ఉన్నపళంగా తెచ్చేయమని మహాదేవునితో అన్నారట- ఇది ధర్మ విరుద్ధం కదా” అన్నాడు.
“ఆ బాలూయే అలసిపోయాను మొర్రో అంటుంటే అని విధాతని నాలుగు చివాట్లు పెట్టి బాలుని గాంధర్వలోకానికి తెప్పించేసాను”ఆ వృత్తాంతం అంతా నా చెవిన వేసాడు పరమాత్మ- అప్పుడు నాకు ఓ చిన్న సందేహం వచ్చింది.
“స్వామీ బాలు అలిసిపోయే మనిషి కాదే” అన్నాను,దానితో శ్రీమహావిష్ణువుకు కొద్దిగా కోపం వచ్చినట్టుంది; “అంటే నీ ఉద్దేశం ఏంటీ అన్నట్టు” మొహంపెట్టాడు నావంక. అప్పుడు నేను ధైర్యం తెచ్చుకొని “స్వామీ ఆ పాట బాలు పాడిన మాట వాస్తవమే; కానీ అది అన్నమయ్య గొంతులో పలికించాడు ఆర్తిగా,అది మీరు “శ్రీనివాసుడి అవతారంలో” ఉండగా అన్నమయ్య పాడిన పాట,పాడింది బాలూయే- వేదన మాత్రం అన్నమయ్యది-అది బాలు వేదన కాదు” అన్నాను.
“భూలోకంలో బాలు అభిమానులు, ఆప్తులు కుటుంబ సభ్యులు అల్లాడి పోతున్నారు-ఆయన క్షేమంగా ఇంటికి తిరిగివస్తాడు అని అనుకుంటుంటే-ఈ హఠాత్పరిమాణానికి”, అనికూడా అన్నాను- ఆయన మోహంలో రంగులు మారటం గమనించి!
నా సమాధానంతో ఆయన మొహం కొద్దిగా ఇబ్బందిగా పెట్టాడు,ఎంతైనా దేవదేవుడు కదా ఆయన చేసిన పొరపాటు ఒప్పుకోడుగా నాకు ఎంత అలవాటు అయినా!
“పోన్లెవయ్యా ఇంకోసారి బాలుని వేరే రూపంలో మళ్ళీ భూలోకానికి పంపిస్తాలే గాంధర్వలోకంలోనే ఉన్నాడుగా- వచ్చినవాడు ఎలాగూ వచ్చాడు- కొన్నాళ్ళు ఊపిరి తీసుకొనీ,సేద తీరనీ” అన్నాడు.
ఆ మాటతో పూర్తి ధైర్యంతో అడిగేశా “స్వామీ ఇది ఇప్పుడు జరిగేదేనా- నేను చూస్తానా” అని! దానికి ఆయన భరోసాగా “నువ్వు వైకుంఠానికి వచ్చే సమయం ఆసన్నం అయ్యేలోపు అతన్ని నీకు చూపించే పూచి నాది-లేకపోతే నువ్వు ఊరుకుంటావా గోల చేయ్యవూ-అయినా మనం కలుస్తూనేవుంటాం కదా బాలు విశేషాలు కూడా చెప్తాలే”అని నవ్వుతూ అన్నాడు.దాంతో చాలా సంతోషంగా ఆయనకు సాష్టాంగ ప్రమాణం చేశా, కరోనా సమయం కదా ఆయనకూ నాకూ వేళాపాళా లేదు- నిద్రకీ, తిండికీ,లేవడానికి, కబుర్లకి -ఆయన అంతర్ధానమయ్యాడు-నేను నిద్రలోకి జారుకున్నా.
అదర్రా సంగతీ-నా వయసువాడికే భరోసా ఇచ్చాడు అంటే చాలామందికి బాలుని మళ్ళీ వేరే రూపంలో చూడటానికి అవకాశం ఉంది ఖచ్చితంగా! “గంధర్వుడు” కదా తన ఉనికి సహజంగానే ప్రపంచానికి తెలియ చేస్తాడు ఏ రూపంలో ఉన్నా-ఎక్కడ ఉన్నా!
ఈ విషయం మీకు పొద్దున్నే చెప్పాలనుకున్నాకానీ -ఇంట్లో ఉండే రోజూవారి పనుల్లో, ఇంకా “హైదరాబాద్ జ్ఞాపకాలు” “బాలు మూలాల మీద సవరణ” రాయడంతో తీరిక దొరకలా-అంచేత ఈ సాయంకాలం అన్నాఇలా మీ చెవుల్లో వేద్దాం అనుకున్నా ఇంకా ఆలస్యం చేయకుండా-లేకపోతే ఈ రాత్రి ఓ పట్టాన నిద్రపట్టి చావదుగా మరి!
ఈ శుభవార్తని ఆయన మాటగా మీ వాళ్లందరికీ చెప్పండి;ఉంటా మరి- నాకైతే చాలా తృప్తిగా ఉంది!